Kaizer News

కరీంనగర్‌లో మెడికల్‌ షాపు సీజ్..

కరీంనగర్‌లో మెడికల్‌ షాపు సీజ్..

· State - Telangana · prabhanews.com

మత్తు టాబ్లెట్ల దందా గుట్టురట్టు.. యజమాని అరెస్ట్ కరీంనగర్, ఆంధ్రప్రభ: డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మత్తు టాబ్లెట్లు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్‌లోని ఓ మెడికల్‌ షాపును డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సీజ్‌ చేశారు. షాపు యజమానిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 28న కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు డ్రగ్స్‌, హాష్‌ ఆయిల్‌, గంజాయి స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణలో జగిత్యాల జిల్లాకు చెందిన నితిన్‌ కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్‌ బ్యాంక్‌ కాలనీ సమీపంలోని డీమార్ట్‌ వద్ద ఉన్న ఆరోగ్య ఫార్మసీ యజమాని కొమ్మ రాముతో పరిచయం పెంచుకుని, ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే టాపాల్‌-50 వంటి మత్తు టాబ్లెట్లను అధిక ధరకు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ టాబ్లెట్లను నీటిలో కరిగించి సిరంజీ ద్వారా నరాల్లోకి ఎక్కించుకుని తొమ్మిది మంది మత్తుకు బానిసలైనట్లు తెలిపారు. వారిని ఇప్పటికే అరెస్ట్‌ చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. నిందితుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించగా, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ ఈ నెల 29న ఆరోగ్య ఫార్మసీలో తనిఖీలు నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు విక్రయించడం, రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించడంతో షాపును సీజ్‌ చేశారు. శనివారం ఉదయం యజమాని కొమ్మ రామును అదుపులోకి తీసుకుని విచారించగా, అధిక లాభం కోసం నిబంధనలు ఉల్లంఘించి టాబ్లెట్లు విక్రయించినట్లు అంగీకరించినట్లు రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏ. నిరంజన్‌రెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న టాబ్లెట్లు, సిరంజీలను పరీక్షలకు పంపినట్లు, నివేదిక వచ్చిన అనంతరం చార్జిషీట్‌ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News