Kaizer News

ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పకడ్బందీ చర్య

ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పకడ్బందీ చర్యలు

· State - Telangana · prabhanews.com

శానిటేషన్ పనులపై సానిటరీ ఇన్‌స్పెక్టర్లతో కమిషనర్ అభిషేక్ అగస్త్య సమీక్ష ఖమ్మం, ఆంధ్రప్రభ: ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా, పారిశుధ్యంగా ఉంచేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. శనివారం సాయంత్రం సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, పర్యావరణ విభాగం అధికారులతో పారిశుధ్య పనులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి వంద శాతం చెత్త సేకరణ, చెత్త పేరుకుపోయే ప్రాంతాల శుభ్రత, రోడ్ల పరిశుభ్రత, డ్రైనేజీల్లో పూడికతీత, ఖాళీ స్థలాల శుభ్రత తదితర అంశాలపై డివిజన్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటికి వెంటనే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా పారిశుధ్య సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించేందుకు ప్రత్యేక త్వరిత స్పందన బృందాన్ని ఏర్పాటు చేయాలని కమిషనర్ నిర్ణయించారు. ఈ బృందం ద్వారా పారిశుధ్య సమస్యలను వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టనున్నారు. ఇంటి నుంచి ఇంటికి చెత్త సేకరణలో ఎలాంటి అంతరాయం లేకుండా అదనంగా ఐదు ట్రాక్టర్లు, పది మంది డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఆటో, ట్రాక్టర్ రోజుకు కనీసం రెండు విడతలు తిరిగి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేలా సానిటరీ ఇన్‌స్పెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి సానిటరీ ఇన్‌స్పెక్టర్ పరిధిలోని డివిజన్లలో ప్రతిరోజూ ప్రత్యేక కార్మిక బృందాలతో శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రోడ్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా శుభ్రపరిచే యంత్రాలు, కార్మికులను సమర్థంగా వినియోగించాలని తెలిపారు. ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోకుండా ఆయా స్థలాల యజమానులతో శుభ్రం చేయించాలని కమిషనర్ ఆదేశించారు. శుభ్రత చర్యలు చేపట్టని ఖాళీ స్థలాల యజమానులపై రూ.5 వేల జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి యజమానులకు బాధ్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు. డ్రైనేజీల శుభ్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించి, సమస్యాత్మక ప్రాంతాల్లో వెంటనే పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. సిబ్బంది సమయానికి విధులకు హాజరయ్యేలా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో పారిశుధ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సానిటరీ ఇన్‌స్పెక్టర్లను కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, పర్యావరణ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News