Global Fuel Crisis: మిడిల్ ఈస్ట్‌లో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఘర్షణ ముదరడం, అలాగే హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా తీవ్రమైన ఇంధన సంక్షోభం తలెత్తింది. దీని ప్రభావం వల్ల అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇంధన కొరతతో, రికార్డు స్థాయి ధరలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. అనేక దేశాల్లో డీజిల్ దొరకడమే కష్టమైపోయి, చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూతపడే పరిస్థితికి వచ్చాయి. అమెరికాలో పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. అక్కడ డీజిల్ సగటు ధర గాలన్‌కు $6.49 (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.622) అనే ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరింది. ఈ సంక్షోభం మొదలవ్వకముందు, అంటే ఫిబ్రవరి 27న డీజిల్ ధర గాలన్‌కు $3.75 (సుమారు రూ.360) మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 73 శాతం పెరిగిపోయింది. ఇక కాలిఫోర్నియా రాష్ట్రంలోనైతే పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడ డీజిల్ గాలన్‌కు $8.41 (సుమారు రూ.807) పలుకుతుంటే, పెట్రోల్ ధర $6.13 (సుమారు రూ.588)కి చేరింది. అమెరికాలో లారీలు, గూడ్స్ రైళ్లు, వ్యవసాయ యంత్రాలు.. ఇలా సరుకు రవాణా అంతా డీజిల్‌పైనే ఆధారపడి నడుస్తుంది. దాంతో డీజిల్ ధరలు మంట పుట్టించడంతో అక్కడ సరుకు రవాణా ఛార్జీలతో పాటు నిత్యావసరాల ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి