Kaizer News

Gambhiraopet: గంభీరావుపేట డిగ్రీ కళాశాలలో ఘనంగా తె

Gambhiraopet: గంభీరావుపేట డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం!

· State - Telangana · hmtvlive.com

గంభీరావుపేట: “దేశ భాషలందు తెలుగు లెస్స” అనే నినాదంతో గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాష గొప్పతనం, చరిత్ర, సంస్కృతి, పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహించినట్లు కళాశాల అధ్యాపకులు తెలిపారు. తెలుగు భాషను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, వ్యవహారిక భాష అభివృద్ధికి గిడుగు వెంకట రామమూర్తి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదని, దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు కూడా ఒకటని పేర్కొన్నారు. 1966లో తెలుగు భాషను రాష్ట్ర అధికార భాషగా గుర్తించారని, 2008లో ప్రాచీన భాషగా గుర్తింపు లభించిందని వివరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశాల్లోనూ తెలుగు మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. తెలుగు భాష కనుమరుగుకాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని అధ్యాపకులు పేర్కొన్నారు. నిత్య జీవితంలో తెలుగును విస్తృతంగా ఉపయోగించడంతో పాటు, భావితరాలకు భాష గొప్పతనాన్ని పరిచయం చేయాలని సూచించారు. తెలుగు విభాగం అధ్యాపకులు దీపిక, భార్గవి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా, కళాశాల అధ్యాపక బృందం వారిని అభినందించింది. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ప్రభాకర్, ఎన్ఎస్ఎస్ పీఓ పాక ధర్మపురి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ వై. ఆంజనేయులు, టాస్క్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రావణ్, డాక్టర్ కె.వి. భిక్షమయ్య, ఎ. మనోహర్, బి. శ్రీనివాస్, మహేష్, కృష్ణ ప్రసాద్, శంకర్, అఖల్యతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News