Kaizer News

టీడీపీకి హరికృష్ణ సేవలు ఎనలేనివి

టీడీపీకి హరికృష్ణ సేవలు ఎనలేనివి

· State - Telangana · prabhanews.com

మాజీ మంత్రి దేవినేని ఉమా విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చివరి శ్వాస వరకు ప్రజల కోసం, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన స్వర్గీయ నందమూరి హరికృష్ణ సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్‌ తనయుడిగా, తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన సైనికుడిగా హరికృష్ణ అందించిన సేవలు పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు విశేష సేవలందించారని తెలిపారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా సినీ నటుడిగా కూడా హరికృష్ణ ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. నిజాయితీ, పట్టుదల, ధైర్యంతో పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేసిన హరికృష్ణ త్యాగాలను ఎప్పటికీ మరువలేమన్నారు. అన్న ఎన్టీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో హరికృష్ణ పాత్ర మరువలేనిదని దేవినేని ఉమా పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హరికృష్ణ ఆశయాల సాధనకు కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News