రాజకీయ స్వార్థం కోసం బరితెగింపు కుల, మతాలను వాడుకోవడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య: ప్రభుత్వ విప్ బోండా ఉమా విజయవాడ, ఆంధ్రప్రభ: కులాలు, మతాలను రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే వైసీపీ విధానమని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మత మార్పిడులు పెద్దఎత్తున జరిగాయని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్వయంగా వెల్లడించిన విషయాన్ని బోండా ఉమా ప్రస్తావించారు. మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు చేసిన వ్యాఖ్యలు కూడా అప్పటి పరిస్థితులను బయటపెట్టాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాముడి విగ్రహాల ధ్వంసం, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం వంటి ఘటనలతో హిందూ ధర్మాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం కోల్పోయిన తర్వాత మరోలా మాట్లాడటం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందని విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడమే వైసీపీ రాజకీయమని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని బోండా ఉమా మండిపడ్డారు. వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరు చూసి ఆ పార్టీని చూసి సిగ్గుపడే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు