Kaizer News

‘వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’

‘వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’

· State - Telangana · ntnews.com

నరసింహపురం సర్పంచ్ రామకోటారెడ్డి ఎర్రుపాలెం, సెప్టెంబర్ 19 : పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపొందించడమే ఏకైక మార్గమని, వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని సర్పంచ్ శీలం రామకోటారెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం నరసింహపురం ప్రాథ‌మిక పాఠశాలలో శనివారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు. మొక్కలకు సకాలంలో నీరు అందించడం, రక్షణ కల్పించడం, వాటి ఎదుగుదలను పర్యవేక్షించడం తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. మొక్క నాటితే బాధ్యత తీరినట్లు కాదని.. అది మహావృక్షంగా ఎదిగే వరకు కాపాడినప్పుడే వన మహోత్సవానికి సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థులు వన మహోత్సవంలో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. విద్యార్థులు తమ ఇళ్ల వద్ద, పాఠశాల ఆవరణల్లో, పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే ప్రస్తుతం పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గామాసు జోగయ్య, ఉపాధ్యాయురాలు కనకదుర్గ, బీఆర్ఎస్ నాయకులు మేరుగుమళ్ల‌ కృపారావు, కాళేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News