Kaizer News

పీఏసీఎస్‌ పాలకవర్గాలను ఎన్నికల ద్వారానే ఏర్పాటు చే

పీఏసీఎస్‌ పాలకవర్గాలను ఎన్నికల ద్వారానే ఏర్పాటు చేయాలి

· State - Telangana · prabhanews.com

మహబూబ్‌నగర్‌ రూరల్‌, ఆంధ్రప్రభ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలను నామినేషన్‌ పద్ధతిలో కాకుండా ఎన్నికల ద్వారానే ఏర్పాటు చేయాలని వివిధ పీఏసీఎస్‌లకు చెందిన రైతులు డిమాండ్‌ చేశారు. సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 908 పీఏసీఎస్‌ల పాలకవర్గాల పదవీకాలం ముగిసి ఏడాదికి పైగా గడిచిందని, ఇప్పటికే రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలను తొలగించి నామినేషన్‌ పద్ధతిలో కొత్త పాలకవర్గాలను నియమించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. 1964 సహకార చట్టంలోని నిబంధనల ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన పీఏసీఎస్‌లకు రైతుల సమ్మతి లేకుండా నామినేషన్‌ ద్వారా పాలకవర్గాలను నియమించడం సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని పేర్కొన్నారు. వెంటనే నామినేషన్‌ ప్రక్రియను నిలిపివేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 908 పీఏసీఎస్‌లకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని రైతులు కోరారు. సహకార సంఘాల పాలనలో రైతుల భాగస్వామ్యం, స్వయం ప్రతిపత్తి కొనసాగాలంటే ఎన్నికల ప్రక్రియ ద్వారానే పాలకవర్గాలను ఎన్నుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బస్వాపూర్‌ మాజీ సర్పంచ్‌ హనుమంతు, డోకూరు ఉపసర్పంచ్‌ లక్ష్మణ్‌, మన్యం రైతులు తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News