తె లంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగం ప్రధానంగా విపక్ష నేత కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. అందులో తప్పులేదు. ఆయనకు ఆ హక్కు ఉంటుంది. కేసీఆర్ కుటుంబం, ఆయన సన్నిహితులు, కొందరు బీఆర్‌ఎస్ నేతలకు సంబంధించిన భూములపై రేవంత్ ఆరోపణలు గుప్పించారు. వీటిపై విచారణ చేసుకోవచ్చని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్ రెడ్డి తదితరులు సవాల్ చేశారు. ఇదే టైమ్‌లో బీఆర్‌ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంపై గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఉన్న వాస్తవాలపై కూడా రేవంత్ వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ రెండు పార్టీల వాదనలు, పరస్పర ఆరోపణలు విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది? రాజకీయ నేతలు తెలంగాణలో భూమిని ఒక పెద్ద ఆదాయ వనరుగా మార్చుకున్నారన్న అనుమానం కలగదా?. రేవంత్ చేసిన ఆరోపణలలో కొన్ని నిజాలు ఉండవచ్చు. కొన్ని నిజం కాకపోవచ్చు. అయినా ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన వివరాలకు ప్రాముఖ్యత ఉంటుంది. కాకపోతే కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల భూములు దోపిడీ చేసిందని ఏదో ఒక ఆరోపణ చేయడం బట్టకాల్చి మీద వేసినట్లుగా ఉంది. రేవంత్ చెప్పిన వివరాల ప్రకారం చూసినా ఆ భూములు విలువ అంత ఉండదని అర్థం అవుతుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దానిపై మంత్రులు పొంగులేటి, వివేక్, దామోదరలను కమిటీగా వేయడం ఏమిటో అర్థం కాదు. అంటే మొత్తం ప్రక్రియ రాజకీయం అయిపోదా అన్న చర్చ వస్తుంది. కేసీఆర్‌కు ఫామ్ హౌస్‌లో ఎంత భూమి ఉందన్నదానిపై రేవంత్ రెడ్డి గందరగోళంగా చెప్పినట్లు అనిపిస్తుంది. కొంతకాలం క్రితం అక్కడ వెయ్యి ఎకరాలు ఉందని ఆయనే అన్నారు. అసెంబ్లీలో 67 ఎకరాలని ప్రకటించారు. 700 ఎకరాల ఫామ్ హౌస్‌లో ప్రభుత్వ భూమి 388 ఎకరాలు ఉందని రేవంత్ అన్నారు. ఈ భూమిని దళితులకు పంచుతానని అన్నారు. బాగానే ఉంది. కాని నిజంగా ఆ స్థాయిలో ప్రభుత్వ భూమి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉంటే ఈ మూడేళ్ల కాలంలో ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారులు పసికట్టలేకపోయారా? కేటీఆర్‌తో పాటు ఆయన సతీమణి, కుమారుడుల పేర ఉన్న భూముల వివరాలు కూడా ఆయన చెప్పారు. అలాగే కేసీఆర్ కుమార్తె కవిత పేరిట ఉన్న భూముల గురించి కూడా చెప్పారు. మొత్తం మీద కేసీఆర్ కుటుంబం పరిధిలో 439 ఎకరాలు ఉందని అన్నారు. కేసీఆర్‌కు బంధువులు అయ్యేవారి కుటుంబాలకు ఉన్న భూములన్నీ కేసీఆర్ ఖాతాలో ఎలా వేస్తారో అర్థం కాదు. ఈ లెక్కలన్ని కాస్త గజిబిజిగా ఉన్నాయనిపిస్తుంది. సర్వే బృందాలను హడావుడిగా పంపించినా అందులో ఏమీ తేలలేదన్నది ఇప్పటికి వస్తున్న సమాచారం. ప్రభుత్వం చెబుతున్న భూమిలో దళితులే వ్యవసాయం చేసుకుంటున్నారని కొన్ని కథనాలు వచ్చాయి. ఆ ధైర్యంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే మొత్తం ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని హరీష్‌రావు సవాల్ విసిరారనుకోవాలి. సిద్దిపేట వద్ద హరీష్ రావుకు చెందిన భూములను కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించి పరిశీలించారు. తొలుత అక్రమ భూములు అని అన్నారు. ఇప్పుడేమో తక్కువ ధరకు కొన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై క్లారిటీతో ఉంటే మంచిది