Kaizer News

రైతులకు కీలక అలెర్ట్... ఈ నెల 30వ తేదీలోపు ఆ పని చ

రైతులకు కీలక అలెర్ట్... ఈ నెల 30వ తేదీలోపు ఆ పని చేయకుంటే సంక్షేమపథకాలు కట్!

· State - Telangana · telugu.oneindia.com

తెలంగాణ రైతులకు ప్రభుత్వం ముఖ్యమైన సూచన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు పొందాలంటే రైతులు అందరూ ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 30వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ఒకే రైతు .. ఒకే గుర్తింపు.. సమగ్ర సేవలు అన్న కాన్సెప్ట్ తో రైతుల కోసం ఫార్మర్ రిజిస్ట్రీని ప్రవేశపెట్టింది. ఇందులో నమోదు చేసుకుంటే ప్రతి రైతుకు ఒక యూనిక్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ ద్వారా రైతులను సులభంగా గుర్తించి, సంక్షేమ పథకాలు అందించవచ్చు. పీఎం కిసాన్, రైతు భరోసా వంటి పథకాలు పొందాలంటే ఈ ఐడీ తప్పనిసరి. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు తొమ్మిది రోజుల పాటు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. అధికారులు గ్రామాలకు వచ్చి ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేస్తారు. లేదా రైతులు మండల పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద కూడా నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే నమోదు అయినవారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కోసం ఆధార్ కార్డు, భూమి పాస్‌బుక్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటే చాలు. ఐడీ వచ్చిన తర్వాత దాన్ని నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఐడీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర పథకాలు, రాయితీలు, సబ్సిడీలు పొందవచ్చు. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకోవడం సులభం అవుతుంది. పెరుగుతున్న చికెన్, గుడ్ల ధరలు.. సామాన్యులకు చుక్కలు.. ఇలా అయితే కష్టమే! ఎరువులు బుక్ చేసుకోవడానికి, వరి, పత్తి, మొక్కజొన్న, కంది వంటి పంటలకు కనీస మద్దతు ధర పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. మీ ఐడీ నంబర్ తెలుసుకోవాలంటే https://tlfr.agristack.gov.in/farmer-registry-tl/#/checkEnrolmentStatus లింక్‌లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ వేస్తే స్క్రీన్‌పై కనిపిస్తుంది. రైతులందరూ ఈ అవకాశాన్ని వదలకుండా సమయానికి నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ఈనెల 30 వతేదీ వరకే డెడ్ లైన్ కావటంతో అసలే మరచిపోవద్దని పేర్కొంది

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News