Kaizer News

Kidney Health: ఎక్కువసేపు కూర్చుంటే కిడ్నీలు ఖరాబ్

Kidney Health: ఎక్కువసేపు కూర్చుంటే కిడ్నీలు ఖరాబ్ కావాల్సిందేనా? డాక్టర్లు చెప్తున్న షాకింగ్ నిజాలు

· Health · hmtvlive.com

Shorts Kidney Health: ప్రస్తుత ఆధునిక కాలంలో చాలామంది ఉద్యోగాలు ఐటీ సెక్టార్‌ లేదా ఆఫీసుల్లో డెస్క్‌లకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటల తరబడి ఒకే చోట కదలకుండా కుర్చీలో కూర్చుని పనిచేయడం నేడు సాధారణమైపోయింది. అయితే ఇలా నిరంతరం కూర్చునే అలవాటు కేవలం నడుము నొప్పి లేదా బరువు పెరగడానికి మాత్రమే కాకుండా, మన శరీరంలోని అత్యంత కీలకమైన కిడ్నీల ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం కూర్చోవడం వల్ల నేరుగా కిడ్నీలు ఫెయిల్ కాకపోయినా, ఈ సిట్టింగ్ లైఫ్‌స్టైల్ అనేక ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని తేల్చిచెప్పారు. ప్రముఖ వైద్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఎక్కువ సమయం శారీరక శ్రమ లేకుండా కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ తీవ్రంగా మందగిస్తుంది. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం, జీవక్రియ మందగించడం, బరువు విపరీతంగా పెరగడం, రక్తపోటు పెరిగే ముప్పు పెరుగుతుంది. మధుమేహం, హైబీపీ వంటి సమస్యలు నేరుగా కిడ్నీలోని రక్తనాళాలను, వ్యర్థాలను ఫిల్టర్ చేసే చిన్న చిన్న భాగాలను దెబ్బతీస్తాయి. దీనివల్ల క్రమక్రమంగా కిడ్నీల పనితీరు క్షీణించి ప్రమాదకర స్థితికి చేరుకుంటుంది. అయితే ఈ ముప్పు నుంచి బయటపడటానికి కొన్ని చిన్న చిన్న జీవనశైలి మార్పులు సరిపోతాయని వైద్యులు సూచిస్తున్నారు. డెస్క్ జాబ్ చేసేవారు ప్రతి గంటకూ ఒకసారి కుర్చీలో నుంచి లేచి కొద్దిసేపు నడవాలి. ఫోన్ మాట్లాడుతూ గదిలో తిరగడం, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అలవాట్లు గుండెతో పాటు కిడ్నీలకూ మేలు చేస్తాయి. అలాగే కిడ్నీ వ్యాధులు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను చూపించకుండా నిశ్శబ్దంగా పెరుగుతుంటాయి. కాబట్టి అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్ లేదా బీపీ సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా కిడ్నీలను సురక్షితంగా కాపాడుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News