భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మైదానంలో దూకుడైన బ్యాటింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ ఆటగాడు.. ఇప్పుడు సామాజిక బాధ్యతను చాటే నిర్ణయం తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో చదువును కొనసాగించలేని విద్యార్థులకు తన వంతు సహాయం అందించాలని ముందుకొచ్చాడు. తాజాగా వైభవ్ సూర్యవంశీ తన సోషల్ మీడియా ఖాతాలో ‘గొప్ప విషయాలు రాబోతున్నాయి.. అలాగే చూస్తూ ఉండండి’ అంటూ ఓ పోస్టు చేశాడు. దీంతో అసలు ఏం ప్రకటించబోతున్నాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే మరుసటి రోజే తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ మరో పోస్టు చేశాడు. తన ఎక్స్ ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చే ఆదాయాన్ని అవసరమైన విద్యార్థుల చదువుకు వినియోగించాలని భావిస్తున్నట్లు వైభవ్ ప్రకటించాడు. పాఠశాల లేదా కళాశాలలో చదువుతున్నప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన విద్యార్థులు తనను సంప్రదించవచ్చని తెలిపాడు. తనకు సాధ్యమైనంత మేర వారికి మద్దతు అందించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. చదువు మధ్యలో ఆర్థిక సమస్యలు అడ్డంకిగా మారుతున్న విద్యార్థులకు ఈ సాయం ఉపయోగపడుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. క్రికెట్‌లోకి వచ్చిన కొద్ది కాలంలోనే వైభవ్ సూర్యవంశీ తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే భారత్ తరఫున అరంగేట్రం చేసి రికార్డులు సృష్టించిన ఈ యువ ఆటగాడు.. ఇప్పుడు తన సంపాదనలో కొంత భాగాన్ని విద్యార్థుల కోసం ఉపయోగించాలనే నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి