శనివారం 44,502 మంది అమ్మవారి దర్శనం పవిత్రోత్సవాలకు పూర్ణాహుతితో శాస్త్రోక్త ముగింపు 49,553 ప్రసాదాల విక్రయాలు.. రూ.3.80 లక్షల విరాళాలు 9,120 మందికి అన్నదానం.. 1,608 మంది తలనీలాలు సమర్పణ ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : శ్రావణ మాస మహోత్సవాల వేళ ఇంద్రకీలాద్రికి భక్తజనం పోటెత్తారు. వారాంతపు సెలవు కావడంతో శనివారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టి దర్శన మార్గాలు, క్యూలైన్లను పర్యవేక్షించారు. దేవస్థానం రోజువారీ గణాంకాల ప్రకారం శనివారం మొత్తం 44,502 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరిలో దర్శన టికెట్ల ద్వారా 8,084 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి పరిసరాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా కనిపించాయి. దేవస్థానంలో మూడు రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. ఆలయ సంప్రదాయాల ప్రకారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర శీనా నాయక్ పాల్గొని పూజలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంతో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా పరిసమాప్తమయ్యాయి. పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం ఆలయ ధర్మపథం వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల ప్రదర్శనలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుభూతిని పొందారు