దమ్మపేట, ఆంధ్రప్రభ : అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు కారులో ప్రయాణిస్తున్న వారందరూ క్షేమంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. అశ్వారావుపేట పర్యటన ముగించుకుని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చండ్రుగొండ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎర్రగుంట దాటిన తర్వాత మద్దుకూరు సమీపంలో అకస్మాత్తుగా ఓ గేదె రోడ్డుపైకి వచ్చింది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే స్పందించినప్పటికీ కారు గేదెను ఢీకొన్నట్లు తెలిసింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఉన్న ఎమ్మెల్యేతో పాటు ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని, జారే ఆదినారాయణ ప్రస్తుతం పూర్తిగా క్షేమంగా ఉన్నారని ఎమ్మెల్యే వర్గాలు వెల్లడించాయి. ఘటన అనంతరం ఆయన ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లను కొనసాగించారు