Kaizer News

పేటలో భగ్గుమన్న బాణసంచా దుకాణాలు..

పేటలో భగ్గుమన్న బాణసంచా దుకాణాలు..

· State - Telangana · prabhanews.com

జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా? చిలకలూరిపేట, (ఆంధ్రప్రభ) : చిలకలూరిపేట రూరల్‌ పరిధిలోని బొప్పిడి ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసిన దీపావళి బాణసంచా దుకాణాల్లో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. చూస్తుండగానే మంటలు భారీగా ఎగసిపడటంతో రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసిన వ్యాపారులు భద్రతా నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారి పక్కనే దుకాణాలు ఏర్పాటు చేసినా.. అక్కడ కనీస అగ్నిమాపక భద్రతా పరికరాలు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే రక్షణ చర్యలు ఎంతమేరకు ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాణసంచా దుకాణాల ఏర్పాటులో నిబంధనలను పాటించారా? లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాణసంచా దుకాణాలకు సంబంధించి ఫైర్‌ సేఫ్టీ, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు లేవని కొన్ని నెలల క్రితమే రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక శాఖల అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు కూడా పంపినట్లు తెలుస్తోంది. అయితే నివేదికలు పంపిన తర్వాత కూడా కఠిన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పేలుళ్ల కారణంగా పరిసర ప్రాంతాల్లో భయానక పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులతో పాటు.. భద్రతా ప్రమాణాలపై ముందస్తు చర్యలు తీసుకోని అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News