రూ.3,500 శ్రీచక్రార్చన టికెట్ పేరుతో మోసం పాత టికెట్‌పై తేదీ, వివరాలు మార్చి విక్రయించినట్లు గుర్తింపు పోలీస్ కమిషనర్‌కు దుర్గగుడి ఈఓ ఫిర్యాదు టికెట్ల కోటా ఇంకా విడుదల చేయలేదన్న దేవస్థానం భక్తులు అప్రమత్తంగా ఉండాలంటూ ఈవో విజ్ఞప్తి.. ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఆసరాగా చేసుకుని నకిలీ పూజా టికెట్లను విక్రయిస్తున్న వ్యవహారం ఇంద్రకీలాద్రిపై కలకలం రేపింది. ఈ వ్యవహారంపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నకిలీ టికెట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 16న కావలికి చెందిన ఓ మహిళా భక్తురాలు దసరా ఉత్సవాల్లో అక్టోబరు 18న నిర్వహించనున్నట్లు పేర్కొన్న రూ.3,500 విలువైన ఆఫ్‌లైన్ శ్రీచక్రార్చన టికెట్‌ను కొనుగోలు చేశారు. టికెట్‌పై అనుమానం రావడంతో దేవస్థానం ఐటీ విభాగాన్ని సంప్రదించారు. అయితే దసరా ఉత్సవాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆన్‌లైన్ కోటాను విడుదల చేయలేదని, ఆఫ్‌లైన్ టికెట్ల విక్రయాలు కూడా ప్రారంభించలేదని ఐటీ విభాగం స్పష్టం చేసింది. దీంతో విషయాన్ని ఈఓ దృష్టికి తీసుకెళ్లగా, పాత పూజా టికెట్‌పై తేదీ, ఇతర వివరాలను మార్చినట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. సదరు మహిళ తనకు తెలిసిన వ్యక్తి ద్వారా ఆలయ ప్రాంగణంలో ఉండే ‘శర్మ’ అనే వ్యక్తి నుంచి టికెట్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే అతని పూర్తి వివరాలు తనకు తెలియవని ఆమె తెలిపినట్లు దేవస్థానం పేర్కొంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఈఓ శీనా నాయక్ శనివారం మధ్యాహ్నం పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నకిలీ టికెట్ల విక్రయం వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి, భక్తులను మోసం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి చర్యల వల్ల భక్తుల విశ్వాసం, మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని దేవస్థానం పేర్కొంది. దేవస్థానంలో నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు, పూజలు, దర్శన టికెట్లు పారదర్శకమైన ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే జారీ చేస్తామని ఈఓ శీనా నాయక్ తెలిపారు. దసరా మహోత్సవాలకు సంబంధించిన కుంకుమార్చన, శ్రీచక్రార్చన, చండీహోమం తదితర ప్రత్యేక పూజల టికెట్ల కోటాను దేవస్థానం ఇప్పటివరకు విడుదల చేయలేదని స్పష్టం చేశారు. టికెట్ల కోటా విడుదల తేదీలను ముందుగానే మీడియా ద్వారా భక్తులకు తెలియజేస్తామని తెలిపారు. దేవస్థానం అధికారిక వెబ్‌సైట్, ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలు, దేవస్థానం నిర్దేశించిన కౌంటర్ల ద్వారా మాత్రమే టికెట్లు పొందాలని సూచించారు. బయట వ్యక్తులు, దళారుల వద్ద పూజలు, దర్శన టికెట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని భక్తులను హెచ్చరించారు. దేవస్థానం పేరుతో ఎవరైనా దర్శనం లేదా పూజా టికెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే ఆలయ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఈఓ కోరారు