భక్తులు, నిర్వాహకులు అధికారులకు సహకరించాలి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాలు, శోభాయాత్రలు నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలో ఈ నెల 23, 24 తేదీల్లో వినాయక నిమజ్జన వేడుకలు జరగనున్ననేపథ్యంలో సమీపంలోని చింతకుంట చెరువు వద్ద మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక ఇతర శాఖల ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ , ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభయాత్ర, నిమజ్జనం వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళికతో వేడుకలను విజయవంతం చేయాలని చెప్పారు. నిమజ్జనానికి కావలసిన, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ, మత్స్యశాఖ, అధికారులు సేవలు అందించాలని, నిమజ్జన ప్రదేశాల్లో పారిశుద్ధ్య పనులు చేయించాలని, భారీ క్రేన్లు, చిన్న క్రెన్లు, గజ ఈతగాళ్ళు అందుబాటులో ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. నిమజ్జనం వేడుకలు భక్తులందరూ భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, తహసీల్దార్ రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు