మీడియా కథనాలపై రాష్ట్ర విజిలెన్స్ అధికారుల విచారణ.. అచ్చంపేట అధికారులతో భేటీ అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో అధికారులు, ఇతర వ్యక్తులు చేతివాటం ప్రదర్శించినట్లు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విజిలెన్స్ అధికారి బాలరాం హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి ఇటీవల పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు శుక్రవారం అచ్చంపేట పట్టణంలో విచారణ చేపట్టారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో కలిసి అచ్చంపేట ప్రాంతాల్లో పర్యటించిన విజిలెన్స్ అధికారులు సంబంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశమయ్యారు. మీడియా కథనాల్లో పేర్కొన్న అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు సంబంధించిన రికార్డులు, ప్రభుత్వ సహాయం, ఇతర అంశాలపై అధికారుల నుంచి వివరణలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలరాం మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, ఇతర అక్రమాలకు పాల్పడటం వంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. అచ్చంపేట ప్రాంతాల్లో లబ్ధిదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు లేదా ఇతర అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయితే బాధ్యులపై కేసులు నమోదు చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మీడియా కథనాల్లో ప్రస్తావించిన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, నిబంధనల మేరకు తదుపరి చర్యలు చేపడతామని విజిలెన్స్ అధికారులు తెలిపారు