కుబీర్, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపెల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కాంతాబాయి అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందారు. కుబీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సిరిపెల్లి ఉపకేంద్రంలో ఆమె దాదాపు 20 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తగా సేవలందిస్తూ గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విధులకు హాజరవుతూ ప్రజలకు సేవలు కొనసాగించారు. కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆమెను స్వగ్రామమైన సిరిపెల్లికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆశా కార్యకర్త కాంతాబాయి మృతి చెందారన్న సమాచారం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అంత్యక్రియలకు కుబీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు హాజరై నివాళులర్పించారు. మృతురాలి కుటుంబం పేదరికంలో ఉందని, ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారని తెలిపారు. ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఆశా కార్యకర్త మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని, ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు