మంత్రి పార్థసారథి అమరావతి, ఆంధ్రప్రభ: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ మద్యం ఘటనలకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బాధ్యత వహించాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీపై గంటల తరబడి మాట్లాడుతున్నజగన్ మద్యం వ్యవహారంపై ఎందుకు మాట్లాడరని? ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ప్రజలకు సమాధానం చెప్పాలని సూచించారు. ఆదివారం రాజధాని అమరావతిలో మంత్రి పార్థసారథి విలేకర్లతో మాట్లాడుతూ.. మద్యం విక్రయాల్లో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. నాణ్యమైన మద్యం అందించేందుకు ప్రతి దశలో నాణ్యత పరీక్షలు చేపడుతున్నామని వివరించారు. కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష’ను తీసుకువచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 13 రకాల పరీక్షలతో మద్యం నాణ్యత పరిశీలిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గౌడ సోదరులకు 10 శాతం మద్యం దుకాణాలు కేటాయించామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో రూ. 3,200 కోట్ల అక్రమాలు జరిగాయని విమర్శించారు. మద్యం కుంభకోణానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచే విధివిధానాలు ఖరారయ్యాయని చెప్పారు. సిట్ దర్యాప్తులో మద్యం కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించిన అంశాలపై సమాధానం చెప్పాలంటూ వైఎస్ జగన్‌ను డిమాండ్ చేశారు. ఈ కేసులో వాస్తవాలు బయటపెట్టిన అధికారిపై మానసిక స్థితి బాగోలేదంటూ ముద్ర వేయడం సరికాదని పేర్కొన్నారు. అధికారులను భయపెట్టి అవినీతి కోసం లొంగదీసుకున్నారని వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి ఎండగట్టారు. గత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా మద్యం విక్రయించారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు