చైల్డ్ హెల్ప్‌లైన్-1098పై విద్యార్థులకు అవగాహన బాలల హక్కులు, రక్షణ చట్టాలపై డీసీపీఓ శారద సూచనలు కర్నూలు, ఆంధ్రప్రభ: బాలల హక్కులు, రక్షణ చట్టాలు, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, బాలలపై జరిగే హింసను గుర్తించే విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీసీపీఓ శారద సూచించారు. కర్నూలు నగరంలోని బి-క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ కళాశాలలో విద్యార్థులకు చైల్డ్ హెల్ప్‌లైన్-1098 సేవలు, బాలల హక్కులు, బాలల రక్షణ చట్టాలు, సంరక్షణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీఓ శారద మాట్లాడుతూ బాలల హక్కులకు భంగం కలిగే పరిస్థితులను గుర్తించడం, బాలలపై జరిగే వివిధ రకాల హింసను గుర్తించడం, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. బాలలకు సంబంధించిన సమస్యలను గుర్తించినప్పుడు వాటిని దాచిపెట్టకుండా వెంటనే సంబంధిత అధికారులకు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్-1098కు సమాచారం అందించాలని సూచించారు. చైల్డ్ హెల్ప్‌లైన్-1098 ప్రాజెక్టు కోఆర్డినేటర్ డి. సుంకన్న మాట్లాడుతూ బాలల రక్షణ, సంరక్షణ, హక్కుల పరిరక్షణ కోసం చైల్డ్ హెల్ప్‌లైన్-1098 నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు. బాల్య వివాహాలు, బాల కార్మికత్వం, బాలలపై హింస, వేధింపులు, నిర్లక్ష్యం, అక్రమ రవాణా వంటి సమస్యలు ఎదురైనప్పుడు, అలాగే ఏదైనా బాలబాలికలు ఆపదలో ఉన్నప్పుడు వెంటనే 1098కు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. బాలల సమస్యలపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని, బాలల రక్షణలో భాగస్వాములై వారి భద్రతకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్, కళాశాల సిబ్బంది, లెక్చరర్లు, డీసీపీయూ లీగల్ ప్రొబేషన్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, కౌన్సిలర్ నాగేశ్వరరావు, సోషల్ వర్కర్ నరసింహులు, చైల్డ్ హెల్ప్‌లైన్-1098 సిబ్బంది భాస్కర్, మారెన్నతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు