పేదలకు అందించే భోజనంలో నాణ్యత తప్పనిసరి: ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక నర్సాపురం, ఆంధ్రప్రభ: పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ నిర్వహణ మహా యజ్ఞం లాంటిదని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. ‘ఇంటింటికి నాయకర్’ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని 5వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని అన్నా క్యాంటీన్‌లో భోజనం చేసి, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. క్యాంటీన్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రతను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే.. పేదలకు అందించే భోజనం విషయంలో నాణ్యతకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని సిబ్బందిని ఆదేశించారు. మంచి ఆశయంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్‌లో భోజన నాణ్యతపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సామాన్య ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజనం చేస్తున్న వారిని ఆహారం రుచి, మంచినీటి వసతి, ఇతర ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమై వారితో కలిసి భోజనం చేయడం ద్వారా వారి పట్ల తనకున్న ఆత్మీయతను ఎమ్మెల్యే చాటుకున్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు కోటిపల్లి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు