Kaizer News

Weather Update: ఏపీవైపు దూసుకొస్తున్న తుఫాన్ ముప్ప

Weather Update: ఏపీవైపు దూసుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

· State - Telangana · tv9telugu.com

తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం వేగంగా బలపడుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ, సెప్టెంబర్ 21 నాటికి వాయుగుండంగా, 22 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత సెప్టెంబర్ 23 ఉదయానికి ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీర సమీపానికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. దీనికి తోడు దక్షిణ కోస్తాంధ్ర, అంతర్గత కర్ణాటక మీదుగా విస్తరించిన ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో రాగల మూడు రోజులు వర్షాలు విస్తారంగా కురవనున్నాయి. ఆదివారం, సోమవారం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ముఖ్యంగా మంగళవారం తీవ్రత మరింత పెరిగి, తీర ప్రాంతాల్లోని అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఆ సమయంలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశముంది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపించనుంది. ఆదివారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. సోమ, మంగళవారాల్లో కూడా బలమైన ఉపరితల గాలులతో పాటు ఒకటి రెండు చోట్ల మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ పంట ఉత్పత్తుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ విభాగం సూచించింది

Original source: tv9telugu.com
Read more on Kaizer News