కార్యకర్తలకు టిడిపి శ్రేణుల పిలుపు కుప్పం అర్బన్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల కుప్పం పర్యటనను పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా విజయవంతం చేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కుప్పం పర్యటనను ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. పర్యటనలో భాగంగా తొలిరోజు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో డీఎస్పీ, ఆర్డీవో కార్యాలయ భవన సముదాయాలతో పాటు రైతు బజార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అపర భగీరథుడిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ ప్రజల కోసం హంద్రీ-నీవా జలాలను మరోసారి కుప్పానికి తీసుకువచ్చారని నేతలు పేర్కొన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం మాట్లాడుతూ.. రెండో విడతగా విడుదల కానున్న కృష్ణా జలాలు ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోకి చేరాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి సమీపంలో హంద్రీ-నీవా జలాలకు జలహారతి ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతులు, వినియోగదారుల మధ్య దళారుల దోపిడీకి చరమగీతం పాడేలా కుప్పంలో రైతు బజార్ నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. దీంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, కుప్పం నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు కంచర్ల శ్రీకాంత్, పీకే యముడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, రెస్కో అధ్యక్షుడు వీజీ ప్రతాప్, ఏఎంసీ అధ్యక్షుడు జి. మునిరాజు, ఏపీఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ ప్రేమ్ కుమార్, ఏరియా హాస్పిటల్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి త్రిలోక్, కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్ పాల్గొన్నారు. అలాగే సీనియర్ నేతలు సాంబశివం, ఎస్‌ఆర్ చంద్ర, చౌడప్ప, బేటప్ప నాయుడు, శాంతిపురం, గుడిపల్లి, కుప్పం మండల టీడీపీ అధ్యక్షులు ఉదయ్ కుమార్, సుబ్రహ్మణ్యం, రాజగోపాల్, క్లస్టర్ ఇన్‌చార్జ్ కే. కన్నన్, రెస్కో వైస్ చైర్మన్ విశ్వనాథ్‌తో పాటు టీడీపీ వివిధ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు