రాష్ట్రపతి చేతుల మీదుగా 22న గుజరాత్‌లో నేషనల్ అవార్డ్స్ భారతీయ సినీ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జాతీయ చలనచిత్ర అవార్డులు చరిత్రలో తొలిసారిగా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. ఇక నుంచి నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానాన్ని దేశరాజధాని ఢిల్లీకే పరిమితం చేయడం లేదు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వేదికను మారుస్తున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తాజా అవార్డుల ప్రదానం గుజరాత్‌లోని నర్మదా జిల్లా ఏక్తా నగర్ (కేవడియా) లో ఈ సెప్టెంబర్ 22, మంగళవారం జరగనుంది. 1970లో ఓసారి మద్రాసులో... 1954లో తొలి జాతీయ అవార్డుల నాటి నుంచి ఇప్పటివరకు అనేక దశాబ్దాలుగా ఢిల్లీ వేదికగానే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం సాగుతూ వచ్చింది. ఒకే ఒక్కసారి 1969వ సంవత్సరానికి సంబంధించిన 17వ జాతీయ అవార్డుల ప్రదానం మాత్రం మద్రాసులో జరిగింది. 1970 నవంబర్ 21న మద్రాసులోని యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో ఆ ఉత్సవాన్ని చేశారు. అయితే, ఆ తర్వాత గత 55 ఏళ్ళలో నేషనల్ అవార్డుల ప్రదానోత్సవం వేదికను మార్చే ప్రయత్నం జరగలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు తొలిసారిగా ఈ ఏడాది వేదిక మారుతోంది. ఏటేటా రాష్ట్రపతి చేతుల మీదుగా సాగే ఈ ప్రదానోత్సవం... ఈసారీ అదే సంప్రదాయాన్ని మాత్రం కొనసాగించనుంది. ఈ నెల ద్వితీయార్ధంలో గుజరాత్ పర్యటనలో ఉండనున్న భారత రాష్ట్రపతి ఈ 72వ జాతీయ అవార్డులను విజేతలకు అక్కడే అందజేయనున్నారు. 2024వ సంవత్సరానికి గాను నేషనల్ అవార్డు విజేతల పేర్లను మొన్న జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విగ్రహం వద్దే వేదికకై ఏర్పాట్లు నర్మదా తీరంలో 2018లో ఏర్పాటైన 597 అడుగుల వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)తో గుజరాత్‌లోని ఏక్తా నగర్ కొంతకాలంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహ నిర్మాణంగా రికార్డులకెక్కిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ దగ్గర ఈ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 2024వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు గాను అందించనున్న తాజా నేషనల్ అవార్డ్స్ ఉత్తమ చిత్రంగా ‘ఆర్టికల్ 370’ ఎంపికైంది. ఉత్తమ నటిగా యామీ గౌతమ్ (‘ఆర్టికల్ 370’), ఉత్తమ నటుడి కేటగిరీలో మమ్మూట్టి (‘భ్రమయుగం’), కార్తీక్ ఆర్యన్ (‘చందు ఛాంపియన్’)లు సంయక్తంగా విజేతలయ్యారు. ఈసారి నాన్ ఫీచర్ కేటగిరీలో ఉత్తమ దర్శకుడి అవార్డు ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – ఏక్తా కా ప్రతీక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్. రాయ్‌కి రావడం విశేషం. ఇప్పుడు సరిగ్గా అదే ప్రాంతంలో జాతీయ అవార్డుల ప్రదానం జరగడం గమనార్హం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తుళు, మరాఠీ, గఢ్వాలీ సహా వేర్వేరు భాషల్లో రూపొందించిన చిత్రాలు అవార్డులను అందుకోనున్నాయి. సంథాలీ భాషలో రూపొందిన ఓ సినిమాకి తొలిసారిగా నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కడం విశేషం. మార్పు ఎందుకంటూ విమర్శలు ‘అవార్డుల ప్రదాన వేదికను ఢిల్లీ నుంచి మారిస్తే మార్చారు కానీ, గుజరాత్‌కి మార్చడమేమిట’ని జాతీయ అవార్డుగ్రహీత – సినీ దర్శకుడు రాహుల్ డోలకియా సహా పలువురు ఇ