పల్లెల్లో పిల్ల బాటలన్నీ పెద్దబాటకు కలిసినట్టు ప్రతి ఇంటి గడపను అక్షర బంధం చేసి అన్నిటినీ మూటగట్టుకొని తమ సత్తువేంటో చూపడానికి సావడి కాడ ఈత సాప మీద గొంగడి పరుచుకొని కుమ్మరించిన బీసీ కులాల కళల తోరణం తేజ్. అవి అలుసైన అక్షరాలు కావు. అన్నం పెట్టి సమాజాన్ని నిలబెట్టిన మూల స్తంభాలు. పొద్దొక్కసారి సాయంత్రమొకసారి వికసించే సూర్యచంద్రికలు కావు. మరిగిన నెత్తురును పులిమిన మాడు చెక్కల వాసన తేజ్. వనపట్ల సీమ నుండి దుబ్బరేగిన అక్షరమొలలతో ప్రశ్నల రేఖలను పదునైన గొంతుకతో ఎక్కుపెట్టి, అసెంబ్లీ, పార్లమెంట్ వేదికల శిఖరమై సాగుతున్న బీసీ వాద సాహితీ స్ఫురణకు చెకుముకి రాయి వనపట్ల సుబ్బయ్య. ఆయన తడారని గొంతులో దిగబడిన బీసీ కులాల నినాదం తేజ్ కవితా సంపుటిలో వరదలై పారింది. సమాజాన్ని మోపుగట్టుకుని మోసే బహుజనులు కొట్లాడే కత్తులు కావాలని, బీసీ రాజకీయ హక్కులకై విప్లవిస్తూ తన నెత్తురు నెరసుపై అలికిన అక్షర కౌముది ఈ తేజ్. ‘ బావిలో ఊటెండి పోయినట్లు చట్టసభల నీతి అడుగంటి పోయింది వజ్రోత్సవాలైన నేనింకా ప్రజా ప్రతినిధిని కాలేకపోయినందుకు సిగ్గుపడుతున్న’ దేశ జనాభాలో అధిక మొత్తంలో ఉన్న బీసీల వాటా ప్రభుత్వాలు తేల్చడం లేదు. అసెంబ్లీనీ పార్లమెంటును చేతుల్లో మోస్తున్న మాకు రాజ్యాధికారం ఎప్పుడు అంటూ ఉద్యమ గీతం అందుకున్నాడు. పందిరి గుంజవే కానీ పందిరివి కారాదు/ కుర్చీకి కాలువే కానీ కుర్చీవి కారాదు అందుకే తేనెటీగలై లేవాలని బీసీ బిడ్డలకు మేలుకొలుపు రాగమై తిరుగుతున్నాడు. రాయడానికి మీకేమి సిగ్గు అనిపించడం లేదా రాజ్యాంగానికి వృద్ధాప్యం వచ్చిందా? అనే ప్రశ్నతో మొదలైన వాక్యం కావ్యం నిండా చురకత్తులై గుచ్చుతూనే ఉంటవి. అవి అధికార దాహము కాదు. అనధికార వేషమూ కాదు. అక్షరబద్ధమైన వాస్తవ స్ఫురణ. రాజకీయ నాయకుల కుటిల వేషాలను ఎండగట్టడానికి తేజ్ చక్రం పరిభ్రమించడం మొదలుపెట్టింది. కమిషన్లు, డిక్లరేషన్లు, రిపోర్టులు, తీర్మానాలన్నీ పాడెల మీదేనా? అంటూ సాగిన అస్తిత్వ గర్జన శివుని గరళం లాంటిదే! బీసీల స్వప్నం సాధనకు మార్గాలు అన్వేషించిన వనపట్ల వస్తు వైవిధ్యంతో, సబ్బండ కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి సింగిల్ నినాదంగా తేజ్ ను నిలబెట్టాడు. బీసీలు అంటే బానిసలు కాదు బహుజనులు అంటూ కొత్త నిర్వచనాన్ని శాస్త్రబద్ధం చేసి మేమెంతో మాకంత అనీ ఒట్టిపోయిన చేతులతో వొడవని చరిత్రను ఆశావాద దృక్పథంతో అంకుశమై పొడుస్తాడు. అంతరించి పోతున్న కులవృత్తులు, మిగిల్చుకున్న జ్ఞాపకాలను రగుల్సుకున్న ఆవేదనను చాలా కవితల్లో ప్రస్తావించారు. చాకలి, మంగలి, కమ్మరి, కంసాలి, గాజుల, గొల్ల, కురుమల గోడునంత వినిపిస్తూనే బహుజన నినాదానికి జెండా ఎత్తి కట్టిన పూలే వారసులను తలుచుకుంటాడు. ఊరూరా ఉత్తరమై తిరిగి ఎద్దు గిట్టల్లా అరిగిన కాళ్లు చాకిరేవు పిలుపు మేలుకొలుపు రాగం ఎప్పుడూ కావాలనీ కోరుకుంటాడు. గ్లోబలైజేషన్ స్వైర విహారంతో చేతివేళ్లు విరిగి బావి దరులు కూలి ఒడ్డెక్కలేక పోతున్నం. అభ్యుదయపక్షమైన రాజకీయ పక్షమా! కాలానికి కాత పూత మేమే! అధికార సమతకై సామాజిక న్యాయాన్ని అడుగుతున్నాం. మా కవాతు బ్యాక్వర్డ్ టు ఫార్వర్డ్. గతాన్ని వర్తమానాన్ని కలుపుకొని కవిత్వ పదమై మైలంటని మంగళి కత్తి అంటూ, ఇంకెప్పుడ