పశ్చిమ ప్రకాశంతో పాటు కరువు పీడిత ప్రాంతాల దశాబ్దాల కల నెరవేరే క్షణం రానే వచ్చింది. దాదాపు 30 ఏళ్లుగా కనుపాపల్లో దాచుకున్న వెలిగొండ ఆశయం.. ఇప్పుడు కృష్ణమ్మ పరవళ్లతో కళ్లముందు నిజమవుతోంది. నల్లమల కొండల గుండెలను చీల్చుకుంటూ దూసుకొస్తున్న జలాలు ఆ ప్రాంత ప్రజల నీటి కష్టాలను సమూలంగా తుడిచిపెట్టేందుకు సిద్ధమయ్యాయి. పక్షుల్లా వలస వెళ్లిన యువతకు సొంత నేలపైనే భవిష్యత్తును అందిస్తూ, కరువు భూముల్లో పసిడి పంటలు పండించేందుకు 'పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు' మొదటి దశ జాతికి అంకితం కావడానికి సర్వం సిద్ధమైంది. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న శుభవేళకు ముందు ఆదివారం చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. పెద్దదోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాల ట్రయల్ రన్‌ను అధికారులు అత్యంత విజయవంతంగా నిర్వహించారు. శ్రీశైలం జలాశయం కొల్లం వాగు వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్ గేట్లను 3.3 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేయగా.. ఆ కృష్ణమ్మ జలాలు 18.8 కిలోమీటర్ల పొడవైన రాతి సొరంగ మార్గాన్ని దాటుకుంటూ మార్కాపురం జిల్లా గడ్డపైకి పరవళ్లతో అడుగుపెట్టాయి. మూడు దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్ట్..సీఎం చంద్రబాబు, ఏడువేల నిర్వాసితుల వల్లే సాకారం! 1996 నాటి సంకల్పం.. సాకారమవుతున్న స్వప్నం! కరువుతో నకనకలాడుతున్న ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలనే ఏకైక సంకల్పంతో 1996లో వేసిన పునాది రాయి ఇప్పుడు మహా ఫలంగా మారింది. తొలి దశ ప్రారంభం ద్వారా ఏకంగా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, ఫ్లోరైడ్ రహిత పరిశుభ్రమైన తాగునీరు 4 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చనుంది. ఈ నీటి పండుగ వెనుక తమ సొంత ఇళ్లను, పచ్చని పొలాలను, పుట్టి పెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 ముంపు గ్రామాల నిర్వాసితుల త్యాగం అమూల్యమైనది. వారి త్యాగాల పునాదులపైనే ఈ రోజే ప్రగతి బాట నిర్మితమైంది. మురిసిపోయిన సీఎం.. ప్రకాశం బ్యారేజీలో నిండుకుండలా గోదావరి నీరు! వెలిగొండ పండుగ వద్ద కలుద్దాం: సీఎం చంద్రబాబు భావోద్వేగం ఈ చారిత్రక సందర్భంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వెలిగొండ అనేది కేవలం రాళ్లు, కాంక్రీటుతో కట్టిన ప్రాజెక్టు మాత్రమే కాదని.. అది రైతన్నకు ఇచ్చే కొండంత భరోసా అని, ఫ్లోరైడ్ పీడితులకు దక్కే ఆరోగ్య రక్షణ అని పేర్కొన్నారు. కరువుపై జరిపిన సుదీర్ఘ పోరాటానికి లభించిన విజయమని సంతోషం వ్యక్తం చేశారు. "రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు ఈ ప్రాంత అభివృద్ధికి అసలైన రెక్కలు.. మనమందరం కలిసి ఈ వెలిగొండ పండుగను జరుపుకుందాం" అంటూ ప్రజలందరికీ పిలుపునిచ్చారు