పొందూరు, ఆంధ్రప్రభ: పొందూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణ సచివాలయం–3ను ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందేలా చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన వివిధ ప్రభుత్వ సేవలను వేగంగా, పారదర్శకంగా అందించాలని సిబ్బందికి సూచించారు. పొందూరు పట్టణ ప్రజలకు స్వర్ణ సచివాలయం–3 అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ సేవల కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా తమకు సమీపంలోనే సేవలు పొందే అవకాశం కలిగిందని ఎమ్మెల్యే రవికుమార్ తెలిపారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు