Kaizer News

ఉపాధ్యాయుల వికాసమే.. విద్యార్థుల భవితకు శ్రీరామరక్

ఉపాధ్యాయుల వికాసమే.. విద్యార్థుల భవితకు శ్రీరామరక్ష

· State - Telangana · prabhanews.com

భవానీపురం, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయులు శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే విద్యార్థులకు ఉత్తమ బోధన అందించగలరని ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ జనరల్ సెక్రటరీ, కరస్పాండెంట్ గోపిశెట్టి మల్లయ్య అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కమిటీ పరిధిలోని వివిధ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సుమారు 700 మంది ఉపాధ్యాయులకు ఆదివారం జక్కంపూడిలోని డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్‌లో క్రీడా పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు పరస్పర స్నేహభావం పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పోటీలను ప్రారంభించిన గోపిశెట్టి మల్లయ్య మాట్లాడుతూ, 120 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హిందూ హైస్కూల్స్ కమిటీ ఆధ్వర్యంలో 8 విద్యాసంస్థలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విద్యాసంస్థల్లో 12 వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయుల మధ్య ఐక్యత, సోదరభావం, సహకార స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారిలో నూతనోత్సాహం నింపేందుకే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కమిటీ అధ్యక్షుడు టి. శేషయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సంక్షేమమే విద్యార్థుల భవిష్యత్తుకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుందని అన్నారు. కమిటీ ట్రెజరర్ డాక్టర్ గోళ్ళ బాబా విజయ్‌కుమార్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. కేబీఎన్ కళాశాల సెక్రటరీ డాక్టర్ టి. శ్రీనివాసు మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ఉపాధ్యాయుల్లో ఐక్యతను పెంచడమే కాకుండా రోజువారీ విధుల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. పోటీల్లో విజేతలకు సెప్టెంబర్ 5న కేబీఎన్ కళాశాలలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని చెప్పారు. డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ ప్రిన్సిపల్ పి. శ్యామల మాట్లాడుతూ, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించకుండా క్రమం తప్పకుండా జీతాలు అందించిన ఘనత తమ యాజమాన్యానిదేనన్నారు. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న హిందూ హైస్కూల్స్ కమిటీ యాజమాన్యానికి తాము రుణపడి ఉంటామని తెలిపారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి యాజమాన్యం అందిస్తున్న సహకారాన్ని ఆమె అభినందించారు. అనంతరం క్రికెట్, త్రోబాల్, అంత్యాక్షరి, తాడులాగుడు, సంగీత కుర్చీలు తదితర పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో పీఎస్‌సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి చిట్టా అమర సుధీర్, ఎంఎస్‌ఆర్ హైస్కూల్ కార్యదర్శి జి. రామారావు, చిట్టూరి హైస్కూల్ కార్యదర్శి డి. సుజాత, హిందూ హైస్కూల్ కమిటీ కార్యదర్శి కేఎల్‌వీ మోహన్‌రావు, బీఈడీ కళాశాల కార్యదర్శి మాజేటి సతీష్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News