Kaizer News

విశాఖ లారీ డ్రైవర్ ఘటనపై సమగ్ర విచారణ

విశాఖ లారీ డ్రైవర్ ఘటనపై సమగ్ర విచారణ

· State - Telangana · prabhanews.com

ఎడిట్‌ వీడియో ఆధారంగా ఏఏంవిఐని దోషిగా తేల్చొద్దు పూర్తి దృశ్యాలు, సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించాలి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో వాస్తవాలు నిగ్గుతేల్చాలి తప్పు నిర్ధారణైతే చర్యలకు వ్యతిరేకం కాదు రవాణా సాంకేతిక అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌. ప్రవీణ్‌ విజయవాడ, ఆంధ్రప్రభ : విశాఖపట్నంలో లారీ డ్రైవర్‌పై దాడి ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోలోని కొంత భాగాన్ని ఆధారంగా చేసుకుని అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ)ను బాధ్యుడిగా నిర్ధారించడం సరికాదని ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ సాంకేతిక అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌. ప్రవీణ్‌, ప్రధాన కార్యదర్శి ఎండీఎల్‌ సిద్దిక్‌ అన్నారు. ఘటనపై నిష్పాక్షికంగా, సమగ్రంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు. విజయవాడ బందరు రోడ్డులోని డీటీసీ కార్యాలయ ప్రాంగణంలోని అసోసియేషన్‌ భవనంలో శనివారం వారు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ.. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదన్నారు. పూర్తి వాస్తవాలు వెలుగులోకి రాకముందే పరిమిత లేదా ఎడిట్‌ చేసిన దృశ్యాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగిని దోషిగా చిత్రీకరించడం సరికాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వీడియోలో లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌పై జరుగుతున్న దాడి దృశ్యాల్లో ఏఎంవీఐ ప్రత్యక్షంగా దాడి చేస్తున్నట్లు కనిపించడం లేదని ఆయన తెలిపారు. అక్కడ ఉన్న కారు డ్రైవర్‌ పాత్రకు సంబంధించిన దృశ్యాలు మాత్రమే కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తి ఘటనను పరిశీలించకుండా ఏఎంవీఐపై నిందలు మోపడం సరికాదన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ఫుటేజీతోపాటు అందుబాటులో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఘటనకు ముందు–తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించాలని పోలీసులను కోరారు. రవాణాశాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా ప్రజలతో నిత్యం ప్రత్యక్షంగా వ్యవహరిస్తుంటారని, వివాదాలు తలెత్తినప్పుడు చట్టపరమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ఎవరైనా తప్పు చేసినట్లు ఆధారాలతో నిర్ధారణ అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడాన్ని సంఘం వ్యతిరేకించదని, అయితే అసంపూర్ణ వీడియోలు లేదా అపోహల ఆధారంగా ఎవరినీ బాధ్యులుగా నిలబెట్టడం సమర్థనీయం కాదని ప్రవీణ్‌ స్పష్టం చేశారు

Original source: prabhanews.com
Read more on Kaizer News