Kaizer News

నీట్‌ పీజీ పరీక్షకు పటిష్ట బందోబస్తు

నీట్‌ పీజీ పరీక్షకు పటిష్ట బందోబస్తు

· State - Telangana · prabhanews.com

చిత్తూరు, ఆంధ్రప్రభ: నీట్‌ పీజీ పరీక్ష నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి, ఐపీఎస్‌ తెలిపారు. ఈ నెల 30న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరులోని ఎస్‌వీసీఈటీ కళాశాల, పలమనేరులోని మదర్‌ థెరిస్సా కళాశాల, కుప్పంలోని కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాల, ద్రవిడియన్‌ యూనివర్సిటీలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 594 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అవసరమైన ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పరీక్షా నిబంధనలను ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని సూచించారు. అభ్యర్థులు నీట్‌ పీజీ ప్రవేశ పత్రం రంగు ప్రతిని వెంట తీసుకురావాలని, పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందుగా చేరుకోవాలని ఎస్పీ సూచించారు. ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు తదితర గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షకు నీలిరంగు బాల్‌పాయింట్‌ పెన్‌ మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు. సాంప్రదాయ, సాంస్కృతిక లేదా మత విశ్వాసాలకు సంబంధించిన వస్తువులు ధరించి వచ్చే అభ్యర్థులు తనిఖీలకు తగిన సమయం ఉండేలా కనీసం రెండు గంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బ్యాగులు, పెద్ద కవర్లు, చేతి గడియారాలు, నగలు తదితర వస్తువులను తీసుకురావడం నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు. ఆహార పదార్థాలు, నీటి సీసాలు, ఇతర ద్రవ పదార్థాలకు కూడా అనుమతి లేదని తెలిపారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు. పరీక్షా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి అభ్యర్థి బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రశాంతంగా పరీక్ష రాయాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News