Kaizer News

నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి

నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి

· State - Telangana · prabhanews.com

సీపీఎం డిమాండ్ నరసాపురం, ఆంధ్రప్రభ : రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు, జిల్లా కమిటీ సభ్యుడు ఏ. రవి మాట్లాడుతూ.. గత మూడు నెలల్లో కిరాణా, కాయగూరల ధరలు 20 నుంచి 50 శాతం వరకు పెరిగాయని తెలిపారు. పంచదార, ఉల్లిపాయల వంటి సరుకుల ధరలు 300 శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సరుకుల ధరల పెరుగుదలతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతు బజార్లు, చౌక డిపోల ద్వారా సబ్సిడీ ధరలకు నిత్యావసర వస్తువులు అందిస్తామని చెప్పిన మాటలు అమలుకు నోచుకోలేదని వారు విమర్శించారు. గతంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచారని, ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. యూపీఐ చెల్లింపులపై చార్జీలు విధించడం దారుణమన్నారు. చాలా మందికి ఉపాధి లభించకపోగా, కొందరికి ఉపాధి ఉన్నప్పటికీ కనీస వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై మరింత భారంగా మారిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని, నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నరసాపురం మండల కార్యదర్శి జల్లి రామమోహనరావు, మొగల్తూరు మండల మాజీ కార్యదర్శి ఎడ్ల చిట్టిబాబు, నరసాపురం పట్టణ మాజీ కార్యదర్శి పొగాకు నారాయణరావు, తెలగంశెట్టి సత్యనారాయణ, నోముల కొండ, బూడిద జోగేశ్వరరావు, కోరాడి బద్రి, పొన్నాడ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News