అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19, 2026న బంధవీధి గ్రామం, కె.కొడపల్లి సచివాలయ పరిధిలో సాసా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం అనంతరం గ్రామస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థుల నుంచి నేరుగా సమస్యలు, వినతులు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. గ్రామస్థాయి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, సంబంధిత శాఖల ద్వారా పరిష్కార చర్యలు చేపట్టడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలును సమీక్షించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. కార్యక్రమానికి సంబంధిత అన్ని జిల్లా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై, తమ శాఖలకు సంబంధించిన అంశాలపై అవసరమైన సమాచారం, వివరాలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను గ్రామస్థాయి PGRSలో నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి అవకాశం వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం కోరింది