Shorts గుంటూరు: గుంటూరు కొత్తపేట మల్లయ్య లింగం భవన్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో కె.వి.వి ప్రసాద్ మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్ అన్నారు. ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సకాలంలో కురవక పలు ప్రాంతాల్లో వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయని, సుమారు 20 వేల హెక్టార్లలకు పైగా పంటలు తెగుళ్ల బారిన పడ్డాయాని తెలిపారు. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలు రాష్ట్రానికి ధాన్యాగారాలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం వర్షాభావంతో పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అనేక మండలాల్లో సాధారణ సాగులో 10 నుంచి 20 శాతం లోపే పంటలు వేసిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో పాటు ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా తగ్గుతున్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని జాతీయ విపత్తుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి కనీసం రూ.25 వేల నష్టపరిహారం అందించాలని, పంటల బీమా పరిహారం అన్ని పంటలకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, చిన్న వ్యాపారులపై ఉన్న రుణాలను రద్దు చేయాలని, కరువు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోకుండా ఉపాధి హామీ పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని కోరారు. కరువు నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, ప్రజలను సమీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజల నుండి సంతకాలు సేకరించి గ్రామ సచివాలయాల ద్వారా మెమోరాండాలపై సంతకాలు సేకరించి జిల్లా కలెక్టర్లకు మెమొరండాలు పంపించాలని పిలుపునిచ్చారు. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కరువు మండలాల ప్రకటన, కరువు సహాయక చర్యలకు చర్యలు ప్రారంభించేలా ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కంజుల విఠల్ రెడ్డి, పీవీ జగన్నాథం పాల్గొన్నారు