మిగిలిన మౌలిక వసతుల పనులు వేగంగా పూర్తి చేయాలి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మాజీ ఎమ్మెల్సీ ఉయ్యూరు, ఆంధ్రప్రభ: ఉయ్యూరు మున్సిపాలిటీలో జెమిని స్కూల్ సమీపంలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాల పనులను మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరిశీలించారు. తమకు కేటాయించిన ఇళ్లను చూసేందుకు లబ్ధిదారులను కూడా అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. టిడ్కో గృహ సముదాయాల్లో మిగిలి ఉన్న రహదారులు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్‌లోపు లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గృహాల నిర్మాణం పూర్తయినప్పటికీ, వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో మిగిలిన 20 శాతం మౌలిక వసతుల పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. టిడ్కో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు డిసెంబర్‌లోపు ఇళ్లను అందజేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాజేంద్రప్రసాద్ సూచించారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో గృహాల పనులను ప్రారంభించి వేగవంతం చేశామని తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో పనులు పూర్తి చేసి జనవరి 15లోగా లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని చెప్పారు. ప్రతి లబ్ధిదారుడికి సొంత ఇంటి తాళం అందజేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు