అసంపూర్తి ప్రాజెక్టులకు బీఆర్ఎస్‌దే బాధ్యత… కేటీఆర్‌కు వాస్తవాలు మాట్లాడే ధైర్యం ఉందా? డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్ విమర్శలపై స్పందించారు. గత బీఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా వదిలేసిన నాయకులు.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. గతంలో ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం జరుగుతున్న పనులు ఏమిటి? అనే విషయాలపై కేటీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించిన పనులు, అనుమతులు, పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం అధికారికంగా వివరాలు వెల్లడిస్తోందని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ విమర్శలు చేయడం కాకుండా.. గతంలో ప్రాజెక్టుల పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయారో కేటీఆర్ సమాధానం చెప్పాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు. గత పాలనలో అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్టులకు బాధ్యత ఎవరిది? ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా రాజకీయ విమర్శలు చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. రైతుల సంక్షేమం, ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునేందర్ కుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వంకేశ్వరం నిరంజన్, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, రంగాపూర్ దర్గా చైర్మన్ రఫీతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు