Kaizer News

సమతుల్య ఆహారంతో ఆరోగ్య‌వంత‌మైన స‌మాజం : సీడీపీవో చ

సమతుల్య ఆహారంతో ఆరోగ్య‌వంత‌మైన స‌మాజం : సీడీపీవో చంద్రకళ

· Health · ntnews.com

నీలగిరి, సెప్టెంబర్ 19 : గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే రక్తహీనతను నివారించి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని నల్ల‌గొండ సీడీపీవో చంద్రకళ, ప‌ట్ట‌ణ 43వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ ఖలీల్ అన్నారు. జాతీయ పోషణ మాసం ఉత్సవాల్లో భాగంగా నల్ల‌గొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గొల్లగూడ‌ సెక్టార్ పరిధిలోని దారుషాప కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం పోషకాహార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, గుడ్లతో ప్రత్యేక ఆహార ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఏయే ఆహార పదార్థాల్లో ఎలాంటి విటమిన్లు, పోషకాలు ఉంటాయో వివ‌రించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలు మంచి పోషక విలువలు ఉండే సమతుల ఆహారం ప్రతిరోజు తీసుకోవాల‌ని, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి, పిల్లల ఎదుగుదల గురించి, వారి మేధో వికాసం గురించి సీడీపీవో వివరించారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిశుభ్రత పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక రోగాలను దూరం పెట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజ‌ర్ జి.సరస్వతి, అంగన్‌వాడీ టీచర్, ఆర్.పి, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News