సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ప్రజలు తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్న పరిస్థితుల్లో ఉంటే నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సమస్యపై స్పందించకుండా రాజకీయ విమర్శలకే వేదికను ఉపయోగించుకున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆక్షేపించారు. విశాఖలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్, గృహ నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల జీతాలు, ఉద్యోగుల తొలగింపులు, ప్లాంట్ భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. నగరంలో మూడు, నాలుగు రోజులకోసారి నీరు వచ్చే పరిస్థితి ఉందని, ట్యాంకర్ల ద్వారా కూడా నీరు దొరకడం లేదని ప్రచార కార్యక్రమాలను, రాజకీయ విమర్శలు పక్కనపెట్టి తక్షణమే విశాఖ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం విశాఖ అభివృద్ధిని అడ్డుకునేలా విలువైన భూములను అనామక కంపెనీలకు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..: విశాఖ నీటి సమస్యపై సీఎం సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి విశాఖపట్నానికి వచ్చినప్పుడు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యపై మాట్లాడతారని ఆశించాం. కానీ విశాఖలో నీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. మూడు రోజుల నుంచి నాలుగు రోజులకోసారి నీరు వచ్చే పరిస్థితి ఉంది. కనీసం ట్యాంకర్ల ద్వారా నీరు కొనుక్కుందామన్నా దొరకడం లేదు. పేదవాడి నుంచి ఉన్నవాడి వరకు అందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రేపటి నుంచి నీటి సమస్య తీరుతుందని, ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతారని ప్రజలు ఎదురుచూశారు. కానీ ఆ సమస్యను పక్కనపెట్టి ప్రతిపక్షాలపై, వైఎస్సార్‌సీపీపై, వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికి వేదికను ఉపయోగించుకున్నారు. ఈ ప్రభుత్వం విశాఖ ప్రజలకు కనీసం మంచి నీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పరిపాలన ఎందుకు అని ప్రజలు ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. విశాఖ భూములపై ఎన్నో ప్రశ్నలు 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములను బినామీలకు కట్టబెడుతున్నారు. ఊరూ పేరు లేని కంపెనీలకు వందలాది ఎకరాలు ఇచ్చారు. వాటిలో ఒక్క కంపెనీ అయినా నిర్మాణం చేపట్టిందా? స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చిన కంపెనీల్లో చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీలుగా కనిపిస్తున్నాయి. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతి రియల్ ఎస్టేట్‌కు దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతో విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. విశాఖకు నీరు కూడా అందకుండా పోతే పెట్టుబడిదారులు ఈ నగరం వైపు ఎందుకు చూస్తారు? విశాఖను అభివృద్ధిని పణంగా పెట్టి మరీ అమరావతిని ప్రమోట్ చేసుకోవాలన్న ఆలోచన రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది కాదు. స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1,000 కోట్లు ఇచ్చాం. ర