Kaizer News

జీపీ భవన నిర్మాణాల్లో వేగం పెంచాలి: సీతక

జీపీ భవన నిర్మాణాల్లో వేగం పెంచాలి: సీతక

· State - Telangana · ntnews.com

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన గ్రామపంచాయతీ, గ్రామ సమైక్య, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, సకాలంలో పూర్తిచేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఆయా భవనాల నిర్మాణ పనుల పురోగతిపై ఆమె అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో 9,745 గ్రామ సమైక్య భవనాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 534 భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మరో 6,141 భవనాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, 3,070 భవనాల పనులు ప్రారంభం కావాల్సి ఉన్నట్టు తెలిపారు. 3,906 గ్రామపంచాయతీ భవనాలు మంజూరు కాగా, ఇప్పటికే 444 భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మిగిలిన 3,444 భవనాల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 2,313 అంగన్‌వాడీ భవనాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 200 భవనాల పనులు పూర్తయ్యాయని, మిగిలిన 2,113 భవనాల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి అదనపు నిధులు సమీకరించేందుకు ఎంపీ లాడ్స్‌ నిధులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయమై తాను రాష్ట్ర ఎంపీలకు లేఖలు రాస్తానని మంత్రి తెలిపారు. సమావేశంలో స్పెషల్‌ సీఎస్‌ దానకిశోర్‌, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ దివ్యాదేవరాజన్‌, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ శృతి ఓఝా, పంచాయతీరాజ్‌ ఈఎన్సీ జగదీశ్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News