ఉదయం నుంచి రాత్రి వరకు.. ప్రజల మధ్యే ఎమ్మెల్యే.. Tiruvuru | (తిరువూరు, ఆంధ్రప్రభ) : ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వరుస కార్యక్రమాలతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నియోజకవర్గంలో పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం, అభివృద్ధి పనులకు శ్రీకారం, పార్టీ కార్యకర్తల కార్యక్రమాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీతో రోజంతా ఆయన కార్యక్రమాలు కొనసాగాయి. తిరువూరు పట్టణంలోని ఒకటో వార్డులో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ‘కార్యకర్తలే కాంట్రాక్టర్లు’ కార్యక్రమంలో పాల్గొని సిమెంట్ రోడ్ల నిర్మాణానికి మంజూరైన రూ.10 కోట్ల నిధులతో చేపట్టనున్న పనులకు సంబంధించి అధికారుల సమక్షంలో పార్టీ కార్యకర్తలకు వర్క్ ఆర్డర్లు అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కార్యకర్తలకు ద్విచక్రవాహనాలను పంపిణీ చేశారు. పార్టీ కార్యకర్తలను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి తిరువూరు మండలంలోని కోకిలపాడు, అక్కపాలెం, మునుకుల్ల, వావిలాల, వాముకుంట్ల, కొమ్మిరెడ్డిపల్లి, రోలుపడి, జి.కొత్తూరు, చౌటపల్లి, చిట్యాల, ఆంజనేయపురం, కాకర్ల తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు రాత్రి 11 గంటల వరకు స్వయంగా అందజేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాలు, పట్టణంలో వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలు, పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే మమేకమయ్యారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై స్థానికులతో మాట్లాడారు. పలుచోట్ల ఎమ్మెల్యేకు ప్రజలు స్వాగతం పలికారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే చేస్తున్న పర్యటనలపై స్థానికులు స్పందించారు. రోజంతా తమ మధ్యే ఉండటంతో ప్రజలు, కార్యకర్తలు ఆయనను అభినందించారు