Kaizer News

నో బై చాలెంజ్‌.. కొనకపోవటం ఒక కళ!

నో బై చాలెంజ్‌.. కొనకపోవటం ఒక కళ!

· State - Telangana · sakshi.com

బ్రష్‌ అయిపోతే.. కొత్తది కొనొద్దు. ఉప్పు, నిమ్మకాయ ఉన్నాయి కదా! టిఫిన్ కావాలంటే.. యాప్‌ తెరవొద్దు. వంటింట్లో బియ్యం, పప్పు ఉన్నాయి కదా! దుస్తులు చిరిగిపోతే... పారేయొద్దు. సూది, దారం ఉన్నాయి కదా! కూరగాయలు అయిపోతే... కార్ట్‌ నింపొద్దు. ఉన్న నాలుగింటితోనే కొత్త రుచిని పుట్టించొచ్చు. షాంపూ... క్రీమ్‌... మగ్‌... ఫోన్ ... డెకర్‌ ఐటమ్స్‌... ఇలా ప్రతి ‘కావాలి’కీ వెంటనే ‘కొనాలి’ అనకుండా, ‘కాసేపు ఆగండి’ అంటున్నది పాతతరం పొదుపరి పెద్దమనుషులు కాదు, కొత్తదనం కోరుకునే కొత్తతరం! ‘నో బై చాలెంజ్‌’ అంటూ కొత్తతరం నేడు కొత్త కొనుగోళ్లు, కోరికలు కళ్లెం వేస్తూ... ఆనందానికి ఆహ్వానం పలుకుతోంది. ప్రపంచం మనకు ప్రతి వస్తువునూ ‘కొత్తది కొనండి’ అని రోజూ మెసేజ్‌లు పంపుతుంటే, కొత్త తరం మాత్రం ‘ఒక్క నిమిషం, నా దగ్గర ఉన్నది ముందు వాడేస్తా!’ అంటూ కార్ట్‌కు బ్రేక్‌ వేస్తోంది. చాలామంది ఇప్పుడు ‘నో బై’ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. అంటే, కొత్త బట్టలు కొనకపోవడం, కొత్త కాస్మెటిక్స్‌ తెచ్చుకోకపోవడం, ఆఫర్‌ చూసి కూడా యాప్‌ మూసేయడం, అవసరం లేని వస్తువుల్ని ‘ఈసారి వద్దు’ అనడం ఇలా కొనుగోళ్లకు గేట్లు మూసేసి, ఉన్నవాటికి రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్న ఈ కొత్త పిచ్చి ట్రెండ్‌ పేరు‘నో–బై చాలెంజ్‌!’ అలా ఈ తరం ‘అసలు బతకడానికి మనకు ఎంత కావాలి?’ అని పరీక్షించుకుంటోంది! నంబర్లు కూడా చెప్తున్నాయి! ఇది కేవలం సోషల్‌ మీడియాలో కనిపించే మరో హ్యాష్‌ట్యాగ్‌ మాత్రమే కాదని కొన్ని సర్వేలు నిరూపించాయి. 2025లో అమెరికాలో 1,015 మంది పెద్దలపై నిర్వహించిన ఓ సర్వేలో 42 శాతం మంది ‘నో బై చాలెంజ్‌’లో ఇప్పటికే పాల్గొంటున్నామని చెప్పారు. మరో 44 శాతం మందిలో ‘బై చాలెంజ్‌’ గురించి అదే విధంగా చెప్పినట్లు వెల్లడైంది. దీని వెనుక ప్రధాన కారణాల్లో 42 శాతం మందికి పొదుపు పెంచుకోవడం, 26 శాతం మందికి అప్పులు తగ్గించుకోవడంలో ఉన్నారు. అయితే ఇదే సర్వే మరో ఆసక్తికరమైన విషయం తెలిపారు. చాలెంజ్‌లో పాల్గొన్న వారిలో 25 శాతం మందికి డబ్బు దాచుకోలేకపోయారు, ఎందుకంటే వారి ఆదాయం అవసరమైన ఖర్చులకే సరిపోతోంది. వీరంతా కూడా ఈ ట్రెండ్‌లో భాగంగానే ఉన్నదానిలో సర్దుకొని జీవితం సాగిస్తున్నారు. భారత్‌లో బడ్జెట్‌ పద్మనాభం! భారతీయ కుటుంబాల్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే ఒక మాట బాగా వినిపిస్తుంది. ‘డబ్బు దాచుకోవాలి. రేపటికి పనికొస్తుంది!’ కానీ అదే పిల్లలు పెరిగి చూసేది మరో లెక్క. పెళ్లి అంటే భారీ ఖర్చు, పండగ అంటే షాపింగ్, ఇంట్లో ఫంక్షన్ అంటే అప్పు చేసైనా ఘనంగా చేయాలి, బంధువుల ముందు తక్కువ కాకూడదు! అంటే మాటల్లో ఉన్న పొదుపు జీవితంలో కనిపించదు. పొదుపు పాఠాలు చెప్పే ఈ పెద్దలందరూ సామాజిక వేడుకల కోసం అవసరానికి మించి ఖర్చు చేయడానికి వెనుకడుగు వేయరు. అయితే, ఈ సామాజిక ఒత్తిడి మధ్య కొత్త తరం ఇరుక్కుపోవడం లేదు. ఆర్థిక విషయాలపై చాలా స్పష్టంగా ఉంటున్నారు. ‘నా డబ్బు నిజంగా దేనికి వెళ్లాలి?’ అనే ఆలోచనతో ప్రతి ఖర్చు చేస్తున్నారు. 2025లో జెన్‌ జీ ఆర్థిక మనసత్వంపై చేసిన ఒక అధ్యయనం ప్రకారం, 57 శాతం మంది సాధారణ నెలలో బట్టలు, గాడ్జెట్ల వంటి వాటిపై ఖర్చు చేస్తున్నప్పటికీ, 62 శాతం మంది పొదుపు, పెట్టుబడ

Original source: sakshi.com
Read more on Kaizer News