Kaizer News

రాష్ట్రపతిని కలిసిన గండుగులపల్లి విద్యార్థిని లహరి

రాష్ట్రపతిని కలిసిన గండుగులపల్లి విద్యార్థిని లహరి..

· State - Telangana · prabhanews.com

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ వేడుకల్లో పాల్గొన్న 9వ తరగతి విద్యార్థిని లహరిని అభినందించిన మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దమ్మపేట, ఆంధ్రప్రభ: దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని పి. లహరి అరుదైన అవకాశాన్ని అందుకుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన రాఖీ పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుని ఆమెతో సంభాషించింది. దేశవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థుల్లో లహరి చోటు దక్కించుకోవడం గండుగులపల్లి పాఠశాలకే కాకుండా మొత్తం ప్రాంతానికి గర్వకారణంగా మారింది. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక రక్షాబంధన్ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులతో ముచ్చటించారు. రక్షాబంధన్ పండుగలోని ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం, బాధ్యత వంటి విలువల ప్రాముఖ్యతను వారికి వివరించారు. సమాజంలో సామరస్యం, మానవత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణపై కూడా రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడారు. చెట్లు, ప్రకృతి పట్ల బాధ్యతాభావాన్ని పెంపొందించుకోవాలని, వాటిని ప్రేమతో సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణపై తమ నిబద్ధతను తెలియజేసేలా చెట్లకు కూడా రాఖీలు కట్టాలని ప్రోత్సహించారు. రాష్ట్రపతి భవన్‌లో దేశ ప్రథమ పౌరురాలిని నేరుగా కలుసుకుని ఆమెతో మాట్లాడడం లహరికి జీవితంలో మరపురాని అనుభవంగా నిలిచింది. గండుగులపల్లి ఏకలవ్య పాఠశాల విద్యార్థిని లహరి రాష్ట్రపతిని కలుసుకోవడంపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అభినందించారు. జాతీయ స్థాయిలో ఎంపికై రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. లహరి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సంజయ్ మలాకర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి అవకాశాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా పెద్ద కలలు కనాలనే స్ఫూర్తిని కలిగిస్తాయని తెలిపారు. దేశానికి సేవ చేయాలనే భావనను విద్యార్థుల్లో పెంపొందించడంలో ఇటువంటి జాతీయ స్థాయి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వగ్రామం కూడా గండుగులపల్లి కావడం విశేషం. అదే గ్రామానికి చెందిన ఏకలవ్య పాఠశాల విద్యార్థిని లహరి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి దేశ రాష్ట్రపతిని కలుసుకోవడం గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. లహరి సాధించిన ఈ అరుదైన అవకాశం పాఠశాల చరిత్రలో ఒక చిరస్మరణీయ మైలురాయిగా నిలిచింది

Original source: prabhanews.com
Read more on Kaizer News