Srisailam: శ్రీశైలం నీట ముంపు నిరుద్యోగులకు జీవో నెం. 98 ప్రకారం ఇంటికొక ఉద్యోగం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ సమస్యను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి ఎన్నికైన తర్వాత పార్లమెంటులో ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న తీరు అభినందనీయమని లబ్బి కొనియాడారు.గతంలో పెండేకంటి వెంకటసుబ్బయ్య తర్వాత నంద్యాల గడ్డ నుంచి సమస్యలపై స్పందించే ఎంపీ లేరని ఇప్పుడు శబరి రూపంలో ఆ లోటు తీరిందన్నారు. బైరెడ్డి కుటుంబానికి రాజకీయంగా ప్రజా సేవలో గొప్ప చరిత్ర ఉందని బైరెడ్డి శేషశయనరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని శబరి కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. 98 జీవో సమస్యను పార్లమెంటులో ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయగల సమర్థురాలు శబరి మాత్రమేనని అన్నారు. ఆదివారం నందికొట్కూరులో 158 రోజులుగా జరుగుతున్న శ్రీశైలం నీట ముంపు నిరుద్యోగుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని లబ్బి వెంకటస్వామి సందర్శించిన అనంతరం వారితో కలిసి ర్యాలీగా బయలుదేరి, జై కిసాన్ పార్క్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ 1986లో ఎన్టీఆర్ ఇచ్చిన జీవో 98 ప్రకారం ఇంకా 674 మందికి ఉద్యోగాలు రావాల్సి ఉందని 40 ఏళ్లయినా ప్రభుత్వాలు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.నీటిమునక నిరుద్యోగులకు ఇంటికి ఒక ఉద్యోగం కల్పించడం వలన వలసలు తగ్గి ఆ కుటుంబం మంచి జీవనాన్ని కొనసాగిస్తుందన్నారు.ఆనాడు వీరికి ఉద్యోగాలు కల్పించడంలో బైరెడ్డి శేష శయనారెడ్డి అలాగే తాను మాత్రమే కృషి చేశామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పెద్దలు స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని అప్పుడు పర్యవసనాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 98 జీవో అమలయ్యేంత వరకు జరిగే ప్రతి ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, నిరుద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు