తిర్యాణి, ఆంధ్రప్రభ: గుండాల గ్రామపంచాయతీ పరిధిలోని సోయం బొజ్జిరావు విగ్రహం నుంచి గుడివాడకు వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రహదారి మొత్తం బురదమయంగా మారడంతో పాటు పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోతోంది. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. బురద కారణంగా ద్విచక్ర వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి సమస్యను గ్రామసభల్లో పలుమార్లు ప్రస్తావించినా శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని ఆరోపించారు. అధికారులు వెంటనే రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తాత్కాలికంగా మొరం పోసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని, శాశ్వతంగా పక్కా రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పటేల్ సోయం భూంరావు, రాయిసిడం సీతారాం, పెందోర్ దౌలత్‌రావు, అడ కిషన్ తదితరులు డిమాండ్ చేశారు