Sircilla: సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంపౌండర్లు సత్యం, తిరుపతిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రిలోనే నిర్లక్ష్యం చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. బైక్ స్కిడ్ కావడంతో రక్తస్రావమైన సిరిసిల్లకు చెందిన సబ్బని చంద్రకాంత్ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా.. ప్రథమ చికిత్స, డ్రెస్సింగ్ చేయాలని కోరినా డ్యూటీలో ఉన్న కాంపౌండర్లు సత్యం, తిరుపతి స్పందించలేదని ఆరోపించారు. డ్రెస్సింగ్ చేసే సమయం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలిపారు. ఈ విషయాన్ని ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సంతోష్, ఆర్ఎంఓ దృష్టికి తీసుకెళ్లినా.. పేషెంట్‌కు వెంటనే చికిత్స అందించేందుకు ఆదేశించినప్పటికీ సిబ్బంది పట్టించుకోలేదని సీపీఎం నాయకులు ఆరోపించారు. పేషెంట్‌ను సుమారు మూడు గంటల పాటు నిలబెట్టడం దారుణమన్నారు. గతంలోనూ వీరిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించి పేదలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేషెంట్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సత్యం, తిరుపతిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు