దానం నాగేందర్‌పై హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు సరైన చెంపపెట్టు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు బరితెగించి తమ స్వార్థ రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగ విరుద్ధమైన ఫిరాయింపులను వాడుకోవడం మానుకోవాలని సూచించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో రాజశేఖర్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తే, ఆ తర్వాత కేసీఆర్ కూడా అదే పని చేశారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు టీఆర్ఎస్‌లో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఈ తీర్పు రాగానే సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకుంటున్న బీఆర్‌ఎస్ నాయకులు ముందు ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు