వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజలు తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శించుకున్నారు. ముందుగా జంపన్నవాగులో స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించి గద్దెల వద్దకు చేరుకున్నారు. అనంతరం సమ్మక్క-సారలమ్మలకు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నూతన వస్త్రాలు, బెల్లం, కొబ్బరికాయలు, ఒడి బియ్యం, పుట్టు వెంట్రుకలు తదితర కానుకలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు జాతర పరిసర ప్రాంతాల్లోని మ్యూజియం, చిలకలగట్టు, సారలమ్మ గుడి తదితర ప్రాంతాలను సందర్శించి ఉల్లాసంగా గడిపారు. కొందరు భక్తులు మేకలు, కోళ్లను అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి, వంటలు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనం చేశారు. అనంతరం స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా పూజారులు భక్తులకు సేవలు అందించారు