నర్సాపురం, ఆంధ్రప్రభ: ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను, అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని పట్టణ సీఐ ఆకుల రఘు హెచ్చరించారు. నర్సాపురం పట్టణ పరిధిలోని పలు లాడ్జీల్లో శుక్రవారం రాత్రి ఆయన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రిలాక్స్ లాడ్జిలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.85,030 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదుతో పేకాట ఆడటం చట్టవిరుద్ధమని సీఐ రఘు పేర్కొన్నారు. లాడ్జి నిర్వాహకులను హెచ్చరించి, తమ ప్రాంగణంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేకాటకు పాల్పడిన వారిపై నర్సాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జూదం చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పట్టణం, పరిసర ప్రాంతాల్లో జూదం, పేకాటతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారితో పాటు వాటిని నిర్వహించే వారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఉదయం పేకాటలో పట్టుబడిన వారిని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి సీఐ రఘు కౌన్సెలింగ్ ఇచ్చారు. పట్టణంలోని ప్రతి లాడ్జిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. లాడ్జి నిర్వాహకులు, యాజమాన్యాలు తమ ప్రాంగణాల్లో ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీల్లో పట్టణ ఎస్‌ఐ ప్రేమరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు