హైదరాబాద్/నెట్‌వర్క్, వెలుగు: రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి మొదలుకొని పల్లెలు, పట్టణాలు, మహానగరాల దాకా జనం జ్వరాలతో మంచం పడుతున్నారు. ఒకవైపు నిలిచిన నీటిలో వృద్ధి చెందే దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా.. మరోవైపు వాతావరణ మార్పులతో ఇన్‌ఫ్లుయెంజా లాంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్ దాడి చేస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, కీలక రక్తపరీక్షల మిషన్ల కొరత వేధిస్తుండగా, గత్యంతరం లేక ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇదే అదనుగా పేద, మధ్యతరగతి రోగులను డెంగ్యూ, ప్లేట్ లెట్ల బూచీ చూపిస్తూ టెస్టులు, అనవసర అడ్మిషన్ల పేరిట నిలువుదోపిడీ చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రధాన బోధనాసుపత్రులైన ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో జ్వర పీడితుల తాకిడి పెరిగింది. ఈ రెండు ఆస్పత్రుల్లో ఒక్కోచోట రోజుకు సగటున 2 వేల మందికి పైగా ఔట్ పేషెంట్లు నమోదవుతున్నారు. చిన్నపిల్లల ప్రధాన ఆస్పత్రి నిలోఫర్‌లో నిత్యం వెయ్యికిపైగా ఓపీకి వస్తుండగా, ఇందులో ఎక్కువగా చిన్నారులు జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో చికిత్స కోసం వస్తున్నారు. ఇక జిల్లాల్లోని పెద్దాసుపత్రులు, ఏరియా దవాఖానల్లో రోజూ 900 నుంచి 1,000 ఓపీ కేసులు రికార్డవుతున్నాయి. ఈ కేసుల్లో దాదాపు 80 శాతానికి పైగా సాధారణ వైరల్ ఫీవర్లేనని అధికారులు చెబుతున్నారు.. రద్దీ పెరగడంతో ఓపీ కౌంటర్లు, ఫార్మసీల వద్ద గంటల తరబడి బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరతతో పాటు రక్తపరీక్షల మిషన్లు మూలనపడ్డాయి.దీంతో సరైన వైద్యం అందక పేదలు దినదినగండంగా బతుకీడుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్వారిగూడెం పీహెచ్‌సీ పరిధిలో 65 మంది డాక్టర్లకు గాను 25 మందే పనిచేస్తుండగా, 25 స్టాఫ్ నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ప్లేట్‌లెట్లు, రక్తకణాల లెక్కింపునకు కీలకమైన సీబీపీ మిషన్ ఏడాది కాలంగా పనిచేయడం లేదు. ఇటీవల తనిఖీల్లో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, సీఎస్ఆర్ నిధుల కింద తక్షణమే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ సీహెచ్‌సీలో వైరల్ ఫీవర్లతో రోజూ ఓపీ 300 దాటుతున్నా.. ఏడుగురికి గాను ముగ్గురే డాక్టర్లు ఉన్నారు. ఫార్మాసిస్ట్ పోస్టు చాలాకాలంగా ఖాళీగా ఉంది. ల్యాబ్ టెస్టులు సైతం నిలిచిపోవడంతో గిరిజనులు ఉట్నూర్, ఆదిలాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి జిల్లా కేంద్ర జీజీహెచ్‌లో ఇప్పటికే 29 మలేరియా, 20 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం శాయంపేట చెంచుపెంటలోని 68 కుటుంబాల్లో దాదాపు ప్రతి ఇంట్లో జ్వరాల బారిన పడ్డారు. ఇక్కడ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ఏడాదిగా మూలనపడడంతో కలుషిత నీరు తాగి రోగాలపాలవుతున్నామని స్థానికులు వాపోతున్నారు.