చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ 10వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ కౌన్సిలర్ గర్రెపల్లి శాంతారాణి సోమవారం మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. వార్డులోని ప్రధాన రహదారులైన రాజీవ్ రోడ్, మెయిన్ రోడ్డులోని సిమెంట్ రోడ్లు పగుళ్లు తేలి ఎత్తుపల్లాలతో అధ్వానంగా మారాయని తెలిపారు. దీంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని కోరారు. అదేవిధంగా 10వ వార్డు పరిధిలోని ముస్లిం కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కౌన్సిలర్ శాంతారాణి తెలిపారు. వాటర్ ట్యాంక్ సమీపంలోని హ్యాండ్‌బోర్ స్థానంలో నూతన మోటారు ఏర్పాటు చేసి కాలనీవాసుల తాగునీటి కష్టాలను పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు